సురేంద్రపురి
యాదగిరిగుట్టకు సమీపంలో ఉన్న సురేంద్రపురి హనుమదీశ్వర ఆలయం తప్పక సందర్శించదగిన ప్రదేశం .
కుందా సత్యనారాయణ కళాధామము ఒక హిందూధర్మ శిల్పకళాప్రదర్శన ఆలయం. పర్యాటకులను ఒక కొత్త
ప్రపంచంలోకి తీసుకువెళ్లగలిగిన హిందూ ధర్మ ప్రదర్శన శాల. ఇక్కడ భారతదేశంలోని పురాణ ప్రాముఖ్యం
కలిగిన సన్నివేశాలు, పురాతన ప్రాముఖ్యం కల దేవాలయాల నమూనాలను చక్కని శిల్పాలుగా మలిచి వర్ణరంజితంగా అలంకరించి చూపరులకు కనువిందు చేస్తున్నారు. ఇక్కడ బ్రహ్మలోకం, విష్ణులోకం, కైలాసం, స్వర్గలోకం, నరకలోకం, పద్మద్వీపం, పద్మలోకాలను దృశ్యరూపంలో చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. పద్మ రూపంలో అనేక దేవతా రూపాలు చూడవచ్చు.
మహాభారత, భాగవతం వంటి పురాణేతిహాసాలలో చోటు చేసుకున్న దృశ్యాలు ఆకట్టుకుంటాయి. మంధర పర్వత సాయంతో క్షీరసాగర మథనం చేస్తున్న దేవతలను రాక్షసులను కూర్మావతారంలో ఉన్న విష్ణు మూర్తిని చూడవచ్చు. గజేంద్ర మోక్షం సన్నివేశాలు కనువిందు చేస్తాయి. యుద్ధానికి సిద్ధంగా ఉన్న సేనల మధ్యలో 36 అడుగుల శ్రీకృష్ణుడి విశ్వరూపదర్శనం, అతడికి భయభక్తులతో నమస్కరిస్తున్న అర్జునుడిని చూడవచ్చు. కాళీయుని పడగల మీద నాట్యమాడుతున్న శ్రీకృష్ణుడు విగ్రహం మనసుకు ఆనందాన్ని కలుగచేస్తుంది. గోవర్దనోద్ధరణ, గోపికా వస్త్రాపహరణ, రాక్షస సంహారం మొదలయిన దృశ్యాలను తిలకించవచ్చు.
పంచముఖ శివుడు కళకు పెద్ద పీట వేస్తూ కట్టిన ఈ దేవాలయంలో భారీ పంచముఖ హనుమంతుని విగ్రహం భక్తులను ఆకర్షిస్తుంది. ఈ విగ్రహం వెనక నుండి చూస్తే పంచముఖ శివుడు దర్శనమిస్తాడు. ఈ దేవాలయ ముఖద్వారం త్రిమూర్తులతో వైభవంగా ఉంటుంది.
అమ్మవారి వాహనం సింహం నోటి నుండి కళాధామానికి ఏర్పాటు చేసిన ప్రవేశ మార్గం చాలా అద్భుతంగా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల నమూనా రూపాలు ఇక్కడ ఉన్నాయి. ఆలయం ఆవరణలో గల అద్దాల మండపం, కొండపైన ఉన్న శివాలయం తప్పకుండా చూడదగినవి. ఈ ప్రదేశాన్నంతా వీక్షంచడానికి సుమారు రెండు గంటల సమయం పడుతుంది.
ఛాయా చిత్రాల ప్రదర్శన
అన్నిటినీ వీక్షించండిఎలా చేరుకోవాలి? :
గాలి ద్వారా
ప్రత్యేక విమాన రవాణా అందుబాటులో లేదు. సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (HYD)
రైలులో
సమీప రైల్వే స్టేషన్ రాయగిరి (RAG)
రోడ్డు ద్వారా
హైదరాబాద్ నగరం నుండి 60 కి.మీ. ఇది యాదగిరిగుట్ట రహదారిపై ఉంది. హైదరాబాద్ లోని ఉప్పల్ సర్కిల్ నుండి ఒక గంట 30 నిమిషాల బస్సు ప్రయాణం ఉంటుంది.