భువనగిరి కోట
ఎన్నో పోరాటాలకు, ఎంతో చరిత్రకు చిహ్నమైన తెలంగాణ రాష్ట్రంలో చెక్కు చెదరని నిర్మాణంగా, చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తుంది ‘భువనగిరి కోట’. దాదాపు 3000 ఏళ్ల నాటి ఈ దుర్గం ఎన్నో ఆశ్చర్యపరిచే నిర్మాణాలకు సౌధం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడడంతో ఇక్కడ పర్యాటక ప్రాముఖ్యత రోజు రోజుకూ పెరుగుతుంది. తెలంగాణ పర్యటనకు వచ్చే టూరిస్టులు హైదరాబాద్ లోని హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్ వంటి వాటితో పాటు ఛార్మినార్, గోల్కొండ కోట వంటి చారిత్రక ప్రదేశాల సందర్శనకు ఆసక్తి చూపుతుంటారు. కేవలం హైదరాబాద్ నగరంలోనే కాదు తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఇటువంటి చారిత్రక కట్టడాలు అనేకం కనిపిస్తాయి. వాటిలో ముఖ్యమైన ప్రదేశాల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న భువనగిరి కోట ఒకటి.
భువనగిరి కోట చరిత్ర:
జానపదులలో భువనగిరి దుర్గం, భువనగిరి నగరంలపై పలు కధలు ప్రచారంలో ఉన్నాయి. చాళుక్య వంశానికి చెందిన ఓ రాజు రాయగిరి వద్ద మల్లన్న గుట్టపై కోట కడుతుండగా బోనయ్య అనే గొల్ల వ్యక్తి… ఇక్కడ కోట ఏమి కడతారు కానీ నేనొక చోటు చూపిస్తా అని భువనగిరి గుట్టను చూపించాడట. ఈ పర్వతపు అందాలకు ముగ్ధుడైన రాజు రాయగిరిలో కోటను కట్టడం ఆపి ఇక్కడ ఖిల్లాను నిర్మించాడట. ఇంత అద్భుతమైన చోటు చూపించిన బోనయ్యకు రాజు ఇనాములివ్వగా, వాటిని సున్నితంగా తిరస్కరించి తన పేరును, తన భార్య గిరమ్మ పేరును కలిపి ఒక ఊరు నిర్మించాలని కోరాడట. రాజు వారి పేర్లపై నిర్మించిన నగరమే నేడు భువనగిరిగా సంస్కృతీకరించబడిందని కధనం. అయితే ఈ జానపద కధకు చారిత్రక ఆధారాలు లేవు.
భువనగిరి దుర్గం 3 వేల ఏళ్లకు ముందే నిర్మించబడిందని, తెలంగాణను ఏలిన అందరి పాలనలో భువనగిరి ప్రాంతం ఉన్నట్లు చరిత్రకారులు చెబుతుంటారు. అయితే భువనగిరి కోటకు ముందే ఈ ప్రాంతంలో మానవ ఆవాస చిహ్నాలు ఉన్నట్లు పురాతత్వ పరిశోధకులు చెబుతున్నారు. ఇక్కడ మధ్యపాతరాతియుగం నాటి బొరిగెలు, బాణాలు, రాతి గొడ్డళ్ళు, కత్తులు, సమాధులు బయటపడ్డాయి. అలాగే మధ్యరాతియుగం నాటి మానవ నివాస జాడలు, నవీన శిలాయుగం నాటి మానవ ఆవాసాలను కనుగొన్నారు.
భువనగిరి కోట కుతుబ్ షాహీల పరిపాలనలో చాలా కాలం ఉంది. తరువాత 1687లో మొఘలులు గోల్కొండను ఆక్రమించినప్పుడు వారి ఏలుబడిలోకి వచ్చింది. తెలంగాణలో సాధారణ కల్లు గీత కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపడు 1708లో ఓరుగల్లును గెలుచుకుని తరువాత భువనగిరిని తన ఆధీనంలోకి తీసుకున్నాడు. గోల్కొండను గెలవడానికి ముందు ఇక్కడ తన అపార ధనరాశులను కొండ అంతర్భాగంలో ఉన్న కాళికా మాత ఆలయంలో దాచి ఉంచాడట. ఈ కొండలో ఇప్పటికీ కనుగొనబడని అనేక గుహలు, సొరంగాలు ఉన్నట్లు చెప్పుకుంటారు. ఇక్కడ విష్ణుకుండినుల కాలం నాటి నాణేలు లభ్యమైనట్లు చరిత్రకారులు పేర్కొన్నారు.
భువనగిరి కోట ప్రత్యేకతలు:
హైదరాబాద్ నగరానికి 47 కిలోమీటర్ల దూరంలో ఏకశిల రాతి గుట్టపై నిర్మించిన ప్రాచీన కట్టడం ‘భువనగిరి కోట’. 610 మీటర్ల ఎత్తైన ఈ కొండ తెలంగాణలోని ఉర్లుకొండ, ఉండ్రుకొండ, అనంతగిరుల కంటే ఎత్తైనది. అండాకారపు ఏకశిలా పర్వతమైన ఈ కొండ దక్షిణం నుంచి చూస్తే తాబేలులా, పడమర నుంచి చూస్తే పడుకున్న ఏనుగులా కనిపిస్తుంది. ఇది బాలాఘాట్ పంక్తులలోని అనంతగిరి వరుసలలోనిది. భువనగిరి కోటను పశ్చిమ చాళుక్య వంశానికి చెందిన 6వ త్రిభువన మళ్లా విక్రమాదిత్య పాలనలో నిర్మించినట్లు చెబుతారు. ఆయన పేరు మీదనే దీనిని భువనగిరి కోటగా పిలుస్తారని, ఇది కాకతీయుల కాలంలో బాగా ప్రసిద్ధి చెందినట్లు చరిత్రకారులు కధనం.
ఈ కొండకు నైరుతి, ఆగ్నేయ దిశల నుంచి పైకి వెళ్లే మార్గాలు ఉన్నాయి. ప్రస్తుత మార్గం నైరుతి నుంచే ప్రారంభం అవుతుంది. భువనగిరి కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అంటారు. ఈ ద్వారాన్ని నిజాం తన సొంత ఖర్చుతో నిర్మించినట్లు చెబుతారు. ఈ ప్రవేశ ద్వారం గోల్కొండ కోటలోని బాలాహిస్సార్ మొదటి ద్వారం ఫతే దర్వాజాను పోలి ఉంటుంది. ఎత్తైన గోడలు, విశాలమైన గదులు ఇస్లాం సంస్కృతి నిర్మాణశైలిలో కనిపిస్తాయి.
కోట లోపలి ప్రాకారాల్లో గుర్రపు కొట్టాలు, ధాన్యాగారాలు, సైనికాగారాలు ఉన్నాయి. రాజాప్రాసాదాల క్రింద శిలాగర్భంలో ఎన్నో అంతుచిక్కని రహస్య మార్గాలు ఉన్నాయి. ఈ సొరంగాలు ఎక్కడికి వెళ్తాయో ఇప్పటికీ ఎవరూ కనుగొనలేకపోయారని చెబుతారు. వీటితో పాటు అంతఃపురం పరిసరాల్లో నీళ్లను నిల్వ చేసుకునే రాతి తొట్టెలు, చాళుక్యుల శిల్పరీతిని ప్రతిబింబించే రాజప్రాసాదాలు, పుష్పాలంకరణలు, కాకతీయ శైలిలో అనేక శిల్పా కళాకృతులు చెక్కబడ్డాయి. భువనగిరి కొండపై ఒక శివాలయం, నల్లని నంది విగ్రహం, కొండ కింద పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మదేవర ఆలయం, ఒక మఠం ఉంటాయి. కాలక్రమంలో కొండపై కొన్ని దేవాలయాలు శిధిలమై గుట్ట లోయల్లో పడి ఉండడం మనం గమనించవచ్చు.
ఛాయా చిత్రాల ప్రదర్శన
అన్నిటినీ వీక్షించండిఎలా చేరుకోవాలి? :
గాలి ద్వారా
సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (HYD)
రైలులో
సమీప రైల్వే స్టేషన్ భోంగిర్ (BG)
రోడ్డు ద్వారా
భువనగిరి రహదారుల ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది NH163 కు చాలా దగ్గరగా ఉంది. హైదరాబాద్, నల్గొండ, హన్మకొండ, వరంగల్ నుండి కూడా తరచుగా బస్సు సౌకర్యం లభిస్తుంది.