శ్రీ మత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి దేవాలయం
మత్స్య రూపంలో విష్ణుమూర్తి కొలువైన కొండగా, ఈ ఆలయాన్ని పరిగణిస్తారు భక్తులు. పర్వదినాల్లో ఈ కొండ ప్రాంతమంతా భక్తుల దైవనామస్మరణతో మార్మోగుతుంది. చల్లని ప్రకృతి ఒడిలో జాలువారే జలపాతాల నడుమ ఈ క్షేత్రం భాసిల్లుతోంది.వలిగొండ మండలం వెంకటాపురం గ్రామ పరిధిలోని మత్స్య గిరి కొండపై వెలసిన లక్ష్మీనారసింహుడిని కోరికలు తీర్చే స్వామిగా భక్తులుకొలుస్తారు. పూర్వం వ్యోములు అనే ఋషులు జనసంచారం లేని ప్రశాంత ప్రదేశం కోసం వెదుకుచూ మత్స్యగిరి కొండ పైకి చేరి తపస్సు మొదలుపెట్టారు. దుష్టశక్తులు వారి తపస్సుకు విఘాతం కలిగిస్తున్న సమయంలో హిరణ్యకశపుణ్ని సంహరించిన ఉగ్రనారసింహుడు ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతానికి వచ్చా డు. దీంతో ఋషులంతా తమను దుష్టశక్తుల బారినుంచి రక్షించమని నర్సింహ స్వామిని ప్రార్థించారు.వారి ప్రార్థనను మన్నించిన స్వామి దుష్టశిక్షణకు పూనుకున్నాడు. పెద్ద శబ్దాల మధ్యన ఆ గుట్టమూడు ముఖాలుగా,మూడు గుండాలుగా మారిందనీ దుష్టశక్తులన్నీ నాశనమయ్యాయని పురాణ కథనం.
సాలగ్రామ రూపంగా స్వయంభువుడై వెలసిన స్వామి పాదాల నుంచి పవిత్రమైన జలం ప్రవహిస్తూ ఆ గుండాలను నింపింది. దీంతో మునులు ఆంజనేయ స్వామిని క్షేత్ర పాలకునిగా ప్రతిష్ఠించి పూజలు ప్రారంభించారు.
అభిషేక పూజ తీర్థానికి మునులు కొలనులోకి వెళ్లగానే నామారుపుడైన స్వామి మత్స్యవతారంలో దర్శనమిచ్చాడు. వేలతీరుల్లో స్వామిని కొలచిన మునులుగల కొండ అందుకే దీనిని వేములకొండ అనీ పిలుస్తుంటారు.
చేపలకు విష్ణునామాలు
సముద్ర మట్టానికిమూడు వేల అడుగుల ఎత్తున ఉన్న కొండపై సహజసిద్ధంగా ఏర్పడిన గుండం నిత్యం నీటితో కళకళలాడుతుంటుంది. ఇందులోకి నీరు ఎక్కడినుంచి వస్తుందో ఎవరికీ అంతుపట్టని రహస్యం.
ఈ పుష్కరిణిలో ఉండేవన్నీ ఒకే రకమైన చేపలు. ఒకే పరిమాణంలో సుమారు అర మీటరు పొడవుతో చిన్న డాల్ఫిన్లలాన్ల కోనేరులో ఈదుతూ కనువిందుచేస్తాయి. వాటి తలలపై విష్ణునామాన్ని పోలినమూడేసి మీసాల్లాంటివి ఉండడంతో వాటిని విష్ణునామాల చేపలు అంటారు. స్థానికులు నామాల గుండం, విష్ణుగుండం, మాలగుండం సముదాయంలో ఈ చేపలుంటాయి. నీటిమట్టం పెరిగినప్పుడు ఈ మూడు గుండాలు కలసిపోయి అర్ధ చంద్రాకారంలా వంపు తిరిగి ఒకే గుండంలా కనిపిస్తాయి.
ఈ గుండాన్ని ఆనుకుని స్వామి వారి ఆలయం ఉంటుంది. ఈ అర్ధ చంద్రాకారపు గుండం మధ్యలో పడమటి ఒడ్డు నీటి అంచున ఆరడుగుల చేప విగ్రహం వుంది.
ఆరు అడుగుల చేప విగ్రహం
చేపలు పల్టీ కొట్టేటప్పుడు కనిపించే వంపుతో ఈశాన్యం నుంచి నైరుతి వైపు విగ్రహం తిరిగినట్టుగా కనిపిస్తుంది. చేప ముఖం మాత్రం తూర్పు వైపు తిరిగి ఉంటుంది.ఈ గుండంలో నీటిమట్టం పెరిగినప్పుడు చేప విగ్రహం నీటిలో తేలుతున్నట్లుగా కనిపిస్తుంది.
పుష్కరిణి ఆవిర్భా వం
శ్రీమత్స్యగిరి లక్ష్మీనారసింహస్వామి సన్నిధి నుంచి జలగా ప్రవహిస్తున్న నీటితో పుష్కరిణి గుండంగా ఏర్పడింది. అదిమూడు భాగాలుగా ఏర్పడడంతో సృష్టి, స్థితి,లయ కారకులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులనీ, లక్ష్మి , పార్వతి, సరస్వతి అనీ, త్రినేత్రాలనీ ఇలా రకరకాల పేర్లతో భక్తులు పిలుచుకుంటుంటారు.
దైవమహిమ వల్లే గుండాల నిండా నీరు ఎప్పుడూ ఉంటుందని భక్తులు భావిస్తారు. ఈ పుష్కరిణిలోనే స్వామివారు చేప రూపంలో శ్రీవైష్ణవ నామాలతో మనకు దర్శనమిస్తున్నారు.
అభయ వృక్షం
దేవాలయం ఆవరణలో ఉన్న రావిచెట్టుకు అభయవృక్షమని పేరు. సంతానం లేనివారు ఇక్కడి పుష్కరిణిలో స్నానం చేసి, స్వామిని ప్రార్థించి, పొట్టుతో ఉన్న కొబ్బరికాయను చెట్టుకు ముడుపు కడితే సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రావణ, భాద్రపద, కార్తీక మాసాల్లో భక్తుల కోలాహలం అధికంగా ఉంటుంది. శని, ఆదివారాల్లో పంచమి,సప్తమి,దశమి తిథుల్లో కొండ ప్రాంతం సందర్శకులతో కిటకిటలాడుతుంది.
ఏటా జ్యేష్ఠశుద్ధ త్రయోదశి నుంచి బహుళ విదియ వరకు అయిదు రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవాలు
జరుగుతాయి. ధనుర్మాసంలో తిరుప్పావై ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తారు. సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలూ జరుపుతారు. ఈ కొండపై ఉంటే ప్రశాంతత లభిస్తుందనీ రోగాలు తగ్గుతాయనీ భూతప్రేత భయాలు తొలగుతాయనీ భక్తుల నమ్మకం.
పుష్కరిణిలోని నీరు మహిమాన్వితమనీ ఈ నీటిని సేవిస్తే రోగాలు నయమవుతాయనీ పంట పొలాల్లో చల్లితే దిగుబడి పెరుగుతుందనే నమ్మకం స్థానికుల్లో ఉంది.
ఛాయా చిత్రాల ప్రదర్శన
అన్నిటినీ వీక్షించండిఎలా చేరుకోవాలి? :
గాలి ద్వారా
సమీప విమానాశ్రయం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (HYD)
రైలులో
వెంకటాపురం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సమీప రైల్వే స్టేషన్ వలిగొండ
రోడ్డు ద్వారా
వేములకొండ రోడ్డు మార్గం ద్వారా బాగా అనుసంధానించబడి ఉంది. ఇది NH163 కి చాలా దగ్గరగా ఉంది. భువనగిరి, నల్గొండ మరియు వరంగల్ నుండి తరచుగా బస్సు సౌకర్యం అందుబాటులో ఉంది.